శ్రీకాకుళం : నవంబరు 22 : రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కలిగించాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్ వ్యవసాయ శాఖాధికారులను, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నీటి పారుదల, వ్యవసాయాధికారులతో రబీ ఆరుతడి పంటల ప్రణాళికపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వంశధార, తోటపల్లి,మడ్డువలస, నారాయణపురం ప్రాజెక్టులలో నీటి లభ్యత, నీటి విడుదల, పంటల విస్తీర్ణం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తక్కువ నీటితో అధిక దిగుబడుల ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కలిగించాలన్నారు. రాగులు, నువ్వులు, అపరాల పంటలు వేసుకుని రైతులు అధిక ఆదాయాన్ని పొందాలన్నారు. వివిధ ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయానికి అనుగుణంగా నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు.అదే విధంగా నీటి విడుదలపై ముందుగా రైతులకు తెలియచేయాలన్నారు. నీటి లభ్యత, భూసారాలను అనుసరించి రైతులు ఏ పంటలు వేసుకుంటే లాభదాయకమో వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కలిగించాలన్నారు. ఈ రెండు శాఖలు సమన్వయంతో పని చేసి రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలన్నారు. ప్రభుత్వం రైతులకు అండగా వుంటుందన్నారు.అరవై శాతం జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి వున్నారని తెలిపారు.వంశధార ఎడమ కాలువ ద్వారా అందించే నీటి ద్వారా హిరమండలం, సారవకోట,జలుమూరు మండలాల్లోని 10వేల ఎకరాలకు లబ్ది కలుగుతుందని తెలిపారు.వంశధార కుడికాలువ ద్వారా హిరమండలం, ఎల్.ఎన్.పేట, సరుబుజ్జిలి, ఆమదాలవలస మండలాల్లోని 30వేల ఎకరాలకు సాగునీటిని అందించడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. మడ్డువలస ద్వారా వంగర, రేగిడి, సంతకవిటి, పొందూరు, జి.సిగడాం మండలాల్లోని గ్రామాలకు సాగునీటిని అందించడం జరుగుతుందన్నారు. మడ్డువలస ఆయకట్టు క్రింద మొక్కజొన్న పంటను రైతులకు వేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. తోటపల్లి రిజర్వాయర్ ద్వారా జి.సిగడాం, రణస్థలం, లావేరు, రేగిడి, వంగర, పాలకొండ సంతకవిటి మండలాల్లో ఇప్పటికే 59 వేల ఎకరాల వ్యవసాయ భూమికి నీరందించడం జరిగింది. చెరువులను కూడా నింపడం జరిగిందని చెప్పారు.తోటపల్లి ఓల్డ్ కెనాల్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, ఇది పూర్తయితే వంగర, పాలకొండ, వీరాఘట్టం మండలాల్లోని 30వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని,ఈ పనులు ఎంతవరకు వచ్చాయని మంత్రి ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నారాయణపురం ఆనకట్ట ద్వారా వ్యవసాయ సాగుకు సరిపడా సాగునీరు సిద్ధంగా ఉందని, భూసారాన్ని అనుసరించి సమర్ధవంతంగా లాభదాయకమైన పంటలను రైతులు వేసుకునేందుకు సహకరించాలని చెప్పారు.ఇందుకు డివిజన్ స్థాయి సమావేశాలను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. రైతులు ఏ సమయంలో ఏ పంటలు వేసుకుంటే లాభదాయకమో అటువంటి పంటలను వేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు.నీటి పారుదల శాఖ, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పనిచేసి మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. ప్రజలకు జవాబుదారీతనంతో అధికారులు పనిచేసి,జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని కోరారు.కలెక్టర్ జె. నివాస్ అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగింది.ఈ సమావేశములో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె. శ్రీధర్, వంశధార పర్యవేక్షక ఇంజీనీర్ పి. రంగారావు, తదతర అధికారులు పాల్గొన్నారు.
ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన అవసరం : మంత్రి కృష్ణదాస్